Pages

Kalabhairava Ashtami Story in Telugu

Story of Kala Bhairava Ashtami, Kalabhairavashtami Katha in Telugu, Legend of Kalabhairava

కాలభైరవాష్టమి కథ, కాలభైరవస్వామి కథ తెలుగు లొ


కాలభైరవాష్టమి కాలభైరవస్వామి జన్మదినం. కాలభైరవాష్టమి కి సంబంధించి శివపురాణం లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది.
బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి
‘‘నేనే సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు. ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా-
‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.
కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు
‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.
దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ... కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.

No comments:

Post a Comment